16, మార్చి 2016, బుధవారం

మగాడు...

ఓ సాయంకాలం... గోదావరి నదీ తీరం...
ఎత్తుగా ఉన్న ఒక ఇసుక తెన్నుపై, తల పైకెత్తి ఆకాశంలో మునుగుతున్న సూర్యుడ్ని చూస్తూ... గప్పు గప్పు పొగ చక్రాలను గాల్లోకి వదుల్తూ... ఎడమ చేతిలో లంకపొగాకు చుట్ట, కుడిచేతిలో పంచె అంచు పట్టుకుని... ఏదో ఆలోచన స్పురించగానే తన దగ్గర పనిచేసే గుమాస్తా ని పిలిచి ఇలా అంటున్నాడు రత్నాచలం.
ఇగో సెగట్రీ ఓపాలి ఇటు రావయ్యా...
అదిగదిగదిగో ఆ దూరంలో ఉన్న సూర్యారావుని సూడు, సింధూరం రంగులో, అందమైన ఆకాశం లాంటి అమ్మాయి నుదుటి మీద తిలకం లా అతుక్కుపోలేదూ...
అలా కూతంత ముందుకొత్తే ఆ రెండు కొండలూ మరి ఆ అమ్మాయి అందాలులా అగుపించట్లేదూ...
మరి ఈ గోదారి సూడు, అమ్మాయి నడుములా వొంపులు తిరగడం లేదూ...
ఈ పెక్రుతిని సూత్తుంటే శానా అందంగా, వగలుపొతున్నట్టు లేదూ...
అదయ్య సంగతి, "మగోడన్నాక కూతంత శృంగార పోషణ ఉండాలయ్యా ఊరికే తిని తొంగుంతే మగోడికి, మదేనుక్కి తేడా ఏటుంతది సెప్పు?". నేను పెక్రుతిని, ఆడాల్లని అరాధిస్తాను మరి.

ఇంకా నయం గురువు గారు, పూలు, అగరబత్తులు పెట్టి పూజించుతా అన్నారు కాదు. అరాధిస్తారా?

ఆ రత్తమ్మ కూతురికి ఐదు వేలెట్టి మాంచి అద్దాలు కోక ఒకటి కొన్నారటగా? మన ఊరంతా కోడై కూస్తంది. ఐనా, బంగారం లాటి భార్య ఇంట్లో ఉంటుండగా మీకు ఈ కోకలు, సీకులు గోలేటండి సెప్పండి.

ఓరి ఎర్రోడా! ఊరుకి నోరు పెద్దది రా, నీరు పోస్తున్న కొద్దీ అరుస్తుంటది. దాని గొడవ మనకేటి గాని, మా ముత్యాలమ్మ మనవరాలు ఇసయం ఏటి సేసినావు రా? నేను ఆరాంధించటానికి ఎప్పుడు ఏర్పటు సేస్తావు రా? ఒక పది వేలు పెట్టి పాపిటి సేరు కొనిచేద్దం.

అయ్య బాబోయ్ పదివేలే! పిలిస్తే పలకడం లేదని వూరుకున్నారు గానీ బాబుగారూ! ఊ అంటే ఊరినే రాసిచ్చేలా వున్నారుగా.

ఆ! తప్పులేదు లేరా, పది వేలమంది బామలని వెనక తిప్పుకున్న కిష్ట పరమాత్తుడంతటోడే, అవసరమయ్యి సత్తెబామ కాలు పట్టుకున్నాడు, అడగ్గానే పారిజాతం కోసం పరిగెత్తాడు. మరి మన లెవలుకి ఒక పది వేలు కర్సెట్టలేమా ఏటి? ఆ మాటకొస్తే, మా తాత, పార్వతీపురం జమీందారీ చేసినప్పుడు, పేటకొక ఇంట్లో, పూటకో వంట తినేవాడు. వాళ్ళందిరికీ అన్నీ రాసిచ్చేసి, సివరకి ఈ గోదావరి ఒడ్డుకి మమ్మల్ని సేర్చాడు.

అందుకే అయ్యగారు, మీ మనవళ్ళకి ఈ సేపల సెరువులు అయినా మిగలాలంటే ఈ ముత్యాలు, రత్తాలు అనకండి.

ఎవరికి ఎక్కడ పెట్టాలో, ఏం వుంచాలో నాకు తెలుసు గానీ, ఆ దూరంగా వెల్తున్న ఆ గీతల సొక్కావోన్ని చూడు? ఆడు మన సుబ్బారావు కొడుకు పెసాదం కదా! ఆడ్ని ఓపాలి ఇటు పిలు.
.........................................................................  తరువాయి భాగం... త్వరలో...